టీటీడీ : శ్రీవారి బంగారం, నగదు ఎంత ఉంది – వెల్లడించిన ఈవో ధర్మారెడ్డి..!!
ఏజెన్సీ న్యూస్ , తిరుమల ప్రతినిది 25 జూలై 2023 , తిరుమల ఆలయ నిర్వహణకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ) ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. పురాతన ఆలయాల పునరుద్ధరణకు, మతమార్పిడులను అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో నూతన ఆలయాల నిర్మాణం కోసం శ్రీవాణి ట్రస్టును ప్రారంభించామని తెలిపారు. శ్రీవారి బంగారం..నగదు లెక్కలతో పాటుగా తిరుమలకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ 900 కోట్ల విరాళాలు: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం నుండి మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనంలో పాల్గొన్న ఈవో స్వామి వారికి ఎంత బంగా రం ఉంది..ప్రసాదాల్లో ఎంత నెయ్యి వాడుతారో వివరించారు. ఇప్పటివరకు 170 పురాతన ఆలయాల పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందించామని, 300 ఆలయాల నిర్మాణం పూర్తయిందని, దాదాపు రెండు వేల ఆలయాలు వివిధ దశలో ఉన్నాయని చెప్పారు. భక్తులు దాదాపు 900 కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందజేశారని, ఇప్పటివరకు 330 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వివరించారు. ఇప్పటివరకు 1600కు పైగా గుండె శస్త్రచికిత్సలు, నాలుగు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని తెలియజేశారు. 17 వేల కోట్ల నగదు..11 టన్నుల బంగారం: శ్రీవారికి అలంకరించే బంగారు ఆభరణాలు 1.2 టన్నులు, వెండి 10 టన్నులు ఉంటుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఏడాదికి శ్రీవారికి 500 టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తున్నట్లు వెల్లడించారు. టటీడీలో 24500 మంది ఉద్యోగులు ఉండగా, రోజుకు 800 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు. శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి ఏటా 500 టన్నుల నెయ్యి వినియోగిస్తామన్నారు. స్వామి పేరుతో రూ 17వేల కోట్ల నగదు, 11 టన్నుల బంగారం బ్యాంకులో డిపాజిట్ చేసామని వివరించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే తోటి భక్తులకు సేవలందించేందుకు 2000 సంవత్సరంలో శ్రీవారి సేవ విభాగాన్ని ప్రారంభించామని, ఇప్పటివరకు 14 లక్షల మంది సేవకులు నమోదయ్యారని తెలిపారు. శ్రీవాణి ట్రస్టుపై మోహన్ భగవత్ ప్రశంసలు: టీటీడీ ఆధ్వర్యంలో 71 ఆలయాలు, 11 ట్రస్టులు, 14 ఆసుపత్రులు, 35 విద్యాసంస్థలు, 9 వేద పాఠశాలలు, నాలుగు గోశాలలు, 300 కళ్యాణ మండపాలు, 10 ధార్మిక సంస్థలు, నాలుగు భాషల్లో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్, అనాధ పిల్లల కోసం బాలమందిరం, రెండు మ్యూజియంలు ఉన్నాయన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెనుకబడిన ప్రాంతాల్లో నూతన ఆలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణను పెద్దఎత్తున చేపట్టినందుకు టీటీడీని అర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసించారు. యాత్రికులకు శ్రీవారి దర్శనం, వసతి, తలనీలాలు, లడ్డూల తయారీ తదితర అంశాల్లో టీటీడీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందన్నారు.