లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని – జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు
ఏజెన్సీ న్యూస్ , కొత్తగూడెం ప్రతినిది 26 జూలై 2023 , తాలిపేరు ప్రాజెక్టు నుంచి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నందున లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతున్నదని ముంపు ప్రాంత గ్రామాలపై యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికార యంత్రాగాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భద్రాచలం నుండి చర్ల వెళ్ళు రహదారిపైకి సత్యనారాయణ పురం, ఆర్ కొత్తగూడెం వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరినందున రాక పోకలు నియంత్రణ చేయాలని చెప్పారు. ప్రజలు రవాణా చేయకుండా బారికేడింగ్ ఏర్పాటుతో పాటు ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎడతెరిపి లేకుండా వర్షం వస్తున్నదని ప్రజలు ఇళ్ళ నుండి బయటికి రావొద్దని చెప్పారు. వాగులు పొంగి ప్రవహిస్తున్నందున రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళొద్దని, ప్రజలు కూడా దాటే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పారు. పశువులను మేతకు బయటికి వదలకుండా ఇంటి పట్టునే ఉంచాలని, వరద చేరిన సందర్భంగా పశువులను ఎతైన ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూము.నంబర్లు కు కాల్ చేయాలని చెప్పారు. అధికార యంత్రాంగం కార్య స్థానాల్లో అందుబాటులో ఉండాలని చెప్పారు.